: ఇక ఇంజెక్షన్ చేయించుకోనక్కర్లేదు!
చాలామందికి ఇంజెక్షన్ చేయించుకోవాలంటే భయం. చిన్న పిల్లలకు సరే... కొందరు పెద్దవారు కూడా సూది వేయించుకోవాలంటే భయపడుతుంటారు. ఇలాంటి వారికి మాత్రం ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే సూది వేయించుకోవాల్సిన పనిలేకుండా సూదిమందును చక్కగా మాత్రల రూపంలో ఇచ్చేలా శాస్త్రవేత్తలు సరికొత్త మాత్రలను తయారుచేస్తున్నారు. ముఖ్యంగా కేన్సర్ వంటి జబ్బులకు ఎక్కువగా ఇంజెక్షన్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి రోగులకు పదే పదే సూది వేయించుకోవాల్సిన అవసరం లేకుండా నోటిద్వారా మందును తీసుకునేలా శాస్త్రవేత్తలు ఈ నానో పార్టికల్స్ టాబ్లెట్లను తయారుచేశారు.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఒక కొత్తరకం నానో పార్టికల్ మందును అభివృద్ధి చేశారు. ఈ మందును సూదిమందుకు ప్రత్యామ్నాయంగా నోటిద్వారా తీసుకునేలా తయారుచేశారు. ఈ నానో పార్టికల్స్ పేగుల్లోనే అబ్సార్బ్ అవుతాయి. ఈ మందు కేన్సర్ లాంటి జబ్బుల్లో వాడే సూదిమందుకు ప్రత్యామ్నాయంగా తయారుచేస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రోహిత్ కార్నిక్ అనే మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కూడా పాలుపంచుకున్నారు.
ఈ నానో పార్టికల్స్ మందులో ఎఫ్సీఆర్ఎన్ అనే రిసెప్టార్లపై ఉండే ఎఫ్పీ ప్రొటీన్ అనే యాంటీబాడీలను కోటింగ్ చేయడం ద్వారా జబ్బుకు కారణమయ్యే కణాల రిసెప్టార్లను పేగుల్లోనే గుర్తించి దానిద్వారా రక్తంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్తరకం మందు హై కొలెస్ట్రాల్, ఆర్థ్రరైటిస్ వంటి జబ్బులకు చికిత్స చేయడానికి కొత్త పద్ధతులను కనుగొనడానికి ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.