: క్రికెట్ ను రాజకీయం చేయకండి: ఉద్దవ్ థాకరే
రాజకీయ నాయకులు క్రీడల్లో జోక్యం చేసుకోవద్దని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే విజ్ఞప్తి చేశారు. క్రికెట్ ఆడుతున్న 11 దేశాల్లో రాజకీయ నాయకుల జోక్యం లేదని, కేవలం భారత్ లోనే ఈ దుస్థితి నెలకొందని సామ్నా పత్రిక సంపాదకీయంలో పేర్కొన్నారు. ప్రధాని పదవి రేసులో ఉన్న పవార్, ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న ముండేలు ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు.
క్రికెట్ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకుల జోక్యం ఆపాలని సూచించారు. గత నెల ఎంసీఏ అధ్యక్ష ఎన్నికల్లో శరద్ పవార్, గోపీనాథ్ ముండేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముండే నామినేషన్ ను సాంకేతిక కారణాలతో తిరస్కరించి, పవార్ ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో వివాదం రాజుకుంది. దీంతో ఎంసీఏ అధ్యక్ష ఎన్నికను సవాలు చేస్తూ ముండే ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.