: సచిన్ ను పొగడటం ఆపండి.. పాక్ మీడియాకు తాలిబాన్ల హెచ్చరిక!
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండుల్కర్ ను కీర్తిస్తూ పాకిస్థాన్ మీడియా వార్తలు ప్రచారం చేయడంపై ఆ దేశ తాలిబాన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయుడైన సచిన్ ను పొగడటం ఆపాలని ఈ మేరకు పంపిన ఓ వీడియోలో తాలిబాన్ కమాండర్ హెచ్చరికలు చేశాడు. ఈ నెల 16న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా 200వ టెస్టు ఆడిన మాస్టర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్ జీవిత చరిత్ర, క్రికెట్ లో ఆయన నెలకొల్పిన రికార్డులు, భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం లాంటి విషయాల సమాహారంతో పాక్ చానల్స్ మాస్టర్ ను ఆకాశానికెత్తేశాయి. ఈ వ్యవహారాన్నంతటినీ గమనించిన పాక్ తాలిబాన్లు చానల్స్ పై మండిపడుతూ వీడియోలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాయి.
ఈ మేరకు.. 'కొన్ని రోజుల నుంచి మేము పాక్ మీడియాను గమనిస్తున్నాము. రిటైర్మెంట్ ప్రకటించిన ఓ భారతీయ క్రికెటర్ గురించి గత మూడు వారాల నుంచి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో, రాస్తున్నారో చూస్తున్నాము. ఓ భారతీయ క్రికెటర్ ను పాక్ మీడియా ఆకాశానికెత్తేయడం చాలా దురదృష్టకరం. పత్రికలు కూడా పెద్ద పెద్ద ఆర్టికల్స్ ప్రచురించాయి. ఇది దేశానికే అవమానకరం. అతనో గొప్ప క్రికెటర్ కావచ్చు. కానీ, ముందు అతను ఓ భారతీయుడు. కాబట్టి, వెంటనే ప్రచారాన్ని ఆపండి' అని వీడియోలో పాక్ కమాండర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.