: చిప్‌తో ఇక చిక్కిపోవచ్చు!
పెరిగిన బరువును తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాం. అలాకాకుండా పెరిగిన బరువును పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడానికిగాను ఒక కొత్తరకం పరికరాన్ని పరిశోధకులు తయారుచేశారు. కంప్యూటర్ చిప్ తరహాలో ఉండే ఈ పరికరాన్ని మన శరీరంలో అమర్చుకుంటే చక్కగా చిక్కిపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
అధిక బరువుతో అలమటించేవారి కోసం ఒక కంప్యూటర్ చిప్‌ను జూరిచ్‌కు చెందిన ప్రొఫెసర్ మార్టిన్ ఫస్సెనెగ్గర్ రూపొందించారు. మానవ జన్యువులతో రూపొందించిన ఈ చిప్‌ను మన శరీరం లోపల అమర్చుతారు. ఇది రక్తంలోని కొవ్వు నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. రక్తంలోని కొవ్వు నిల్వలు పెరిగినప్పుడు ఇది తృప్తి కలిగిన అనుభూతిని కలిగించే ఒక రకమైన సంకేతాన్ని విడుదల చేస్తుంది. దీంతో ఈ చిప్ అమర్చిన వ్యక్తి ఆహారం తీసుకోవడం ఆపేస్తారు. రక్తంలోని కొవ్వు నిల్వలు మామూలు స్థాయికి చేరగానే చిప్ ఆ సంకేతాలను ఆపేస్తుందని మార్టిన్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిప్‌తో ఎలుకలపై చేస్తున్న ప్రయోగాలు విజయవంతం అయ్యాయని, ఇది మనుషులకు అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుందని మార్టిన్ చెబుతున్నారు.