: అత్యాచార ఘటనపై రెండో రోజు అట్టుడికిన అసోం
నిర్భయ ఘటన తరువాత మళ్ళీ అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచార ఘటనపై అసోం రెండో రోజు కూడా అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామన్న పోలీసుల మాటలు నీటిమూటలైనందున మరోసారి ఆందోళనలు ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనల్లో మహిళలు, మహిళా సంఘాలు, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు పాలు పంచుకున్నారు.
అసోంలోని లఖ్మీపూర్ జిల్లాలోని బోగీనది ప్రాంతానికి చెందిన ఓ మహిళ... 7 ఏళ్ల తన బిడ్డను స్కూలు నుంచి తీసుకువచ్చేందుకు షేరింగ్ టెంపో ఎక్కింది. అందులో ఉన్న నలుగురు కీచకులు ఒకరి తరువాత ఒకరు ఆమెను అనుభవించి... అనంతరం కళ్లు పీకి.. తలపైన, మెడ పైన తీవ్ర గాయాలు చేసి రోడ్డు మీదికి తోసేయడంతో ఆమె మరణించింది. దీంతో ఆందోళనలు మిన్నంటాయి. రెండో రోజు కూడా ఈ ఘటనపై ఆందోళనలు జరుగుతున్నాయి.