: ఐదు వికెట్ల తేడాతో భారత్ గెలుపు.. సిరీస్ టీమిండియాదే
భారత జట్టు ఊహించినట్టే వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 263 పరుగుల స్కోరు సాధించింది. అనంతరం టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ రోహిత్(4) నాలుగో ఓవర్ లోనే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ(19) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు.
వరుసగా రెండు వికెట్లు పడ్డా ధావన్ ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. బౌలర్లు ఎంత ఇబ్బంది పెట్టినా తన పని తాను చేసుకుపోయాడు. మంచి బంతిని గౌరవిస్తూ, చెత్త బంతిని బౌండరీలు దాటిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ కూడా అర్ధసెంచరీ చేశాడు. అనంతరం చక్కని బంతితో యువరాజ్(55) ను సునీల్ నరైన్ బలిగొన్నాడు.
మరి కాసేపటికే ధావన్(119) ను బ్రావో పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం ధోనీ, రైనా ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా భారత జట్టును నడిపించారు. ఈ క్రమంలో విజయానికి మరో 15 పరుగులు అవసరమవగా రైనా(34)ను బ్రావో బోల్తా కొట్టించాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి కెప్టెన్ ధోనీ(18) మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో టెస్టుతో పాటు వన్డే సిరీస్ ను కూడా టీమిండియా గెలుచుకుంది.