: తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే హత్య
తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే నూరేళ్ల జీవితం ఆశలన్నీ ఆవిరైపోయాయి. హైదరాబాద్ నానల్ నగర్ లోని షాగౌస్ హోటల్ దగ్గర పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. హత్య చేసిన దుండగులు పోలీసులకు సమాచారం అందించి మరీ పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లేపల్లికి చెందిన అవాయిస్ (26) అన్వర్ ఉలూం డిగ్రీ కళాశాలలో చదువుతూ స్థానిక జిమ్ లో కోచ్ గా ఉన్నాడు. ఇతను పాతబస్తీలో ఓ పహిల్వాన్ కు ప్రధాన అనుచరుడు. రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. ఈ మధ్యే ఇతను మరో పార్టీలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. .
మరో వైపు ఓ యువతిని వేధిస్తున్న విషయంలో ఈ మధ్యే అవాయిస్ కొంత మందితో గొడవ పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత అర్థరాత్రి అవాయిస్ తో మాట్లాడాల్సి ఉందంటూ ఫోన్ వచ్చింది.దీంతో తన అన్న అసిఫ్, మరో ఇద్దరితో కలిసి రాత్రి 2 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లాడు. అక్కడికి రాగానే వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం నుంచి తేరుకునే లోపు దుండగులు అవాయిస్ ను కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. దీంతో షాక్ నుంచి తేరుకున్న అసిఫ్, ఇతరులు అవాయిస్ ను ప్రక్కనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన కాసేపటికే అవాయిస్ మృతి చెందాడు.
అవాయిస్ కు బజార్ ఘాట్ కు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. తెల్లవారితే నిశ్చితార్థం. ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. విషయం తెలియడంతో బంధువులు, స్నేహితులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నాంపల్లి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.