: హైదరాబాద్ ను యూటీ చేసి తీరాల్సిందే: చిరంజీవి
హైదరాబాద్ ను ఎట్టిపరిస్థితుల్లో యూటీ చేయాల్సిందేనని కేంద్ర మంత్రి చిరంజీవి కుండబద్దలు కొట్టారు. ఉమ్మడి రాజధానికి నిర్వచనం లేనందున యూటీ చేయక తప్పదని అన్నారు. ఈ రోజు ఢిల్లీలో జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయిన అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ను యూటీ చేస్తే 90 శాతం మంది సీమాంధ్రులకు సంతోషం కలుగుతుందని తెలిపారు. హైదరాబాద్ యువత అవకాశాలకు వేదికని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పై అందరికీ భావోద్వేగాలు ఉన్నాయని అన్నారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తిచేయాలని జైరాంను కోరినట్టు తెలిపారు. 1956కు ముందు భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నందున... ఇప్పుడు కూడా భద్రాచలాన్ని తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంచాలని అన్నారు.
సమన్యాయం ఎలా పొందాలనే దానిపై ఇన్నాళ్లూ ఆలోచించామని చిరంజీవి చెప్పారు. విభజన అనివార్యమైనందున ఇతర ప్రయోజనాలు ఎలా పొందాలో ఆలోచించాలని తెలిపారు. కలిసి ఉండాలని పట్టుబట్టేదానికంటే... విడిపోతే ఎలా ప్రయోజనం పొందాలనే దానిపై దృష్టి సారిస్తే మంచిదని అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేవలం తమ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని విమర్శించారు. రాయలతెలంగాణ అంశం అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు.