: 26/11 కేసు విచారణ.. పాక్ లో దీనికి అంతం లేదు!
ముంబై దాడి (2008 నవంబర్ 26.. దీనికే 26/11 అని సంక్షిప్త నామం) నిందితులను చట్టప్రకారం శిక్షించే విషయంలో పాకిస్థాన్ కు చిత్తశుద్ధి లేనట్లు ఉంది. ఉగ్రవాదులకు అన్ని విధాలా సహకరించి భారత్ లో మారణహోమానికి కారణమైన దేశం నుంచి చిత్తశుద్ధి ఆశించడం కూడా అత్యాశే. నాటి దాడి కేసు విచారణ భారత్ లో ఎప్పుడో పూర్తయింది. అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష కూడా అమలు చేశారు. కానీ, నాటి దాడి సూత్రధారులు.. పాక్ నుంచి అంతా నడిపించిన వారికి మాత్రం దండనలేదు.
దాడి సూత్రధారులను తమకు అప్పగించాలని భారత్ కోరినా పాక్ అందుకు ఒప్పుకోలేదు. దాడి సూత్రధారులు తమ దగ్గర లేరని ముందు బుకాయించింది. ఆ తర్వాత మాత్రం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసింది. విచారణ పేరుతో కాలయాపన జరుగుతోంది కానీ, దోషులను శిక్షించే ఉద్దేశం కనిపించడం లేదు. ముఖ్యంగా హఫీజ్ సయీద్ ను భారత్ కీలక సూత్రధారిగా పేర్కొంది. దాడులకు ప్రణాళిక వేసింది ఇతడేనని తేలింది. కానీ అతడిని కొన్నాళ్లు గృహ నిర్బంధం అనంతరం పాక్ విడుదల చేసింది. ఈ కేసులో అతడిపై విచారణ లేదు. మరో విషయం ఏమంటే ఈ కేసు విచారణ జరుగుతున్న రావల్పిండిలోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఇప్పటికి ఐదు సార్లు జడ్జిలు మారారు. ఇది పాక్ నైజానికి పరాకాష్ట.