: మిజోరంలో ముగిసిన పోలింగ్ వివరాలు
మిజోరం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. వివిధ పార్టీల నుంచి మొత్తం 142 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం కావడంతో ఓటర్లు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. దీంతో సుమారు 80 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
40 నియోజకవర్గాల్లో 39 ఎస్టీ రిజర్వుడు కాగా ఒకటి జనరల్ నియోజకవర్గం. బరిలో నిలిచిన 142 మందిలో ఆరుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. మొత్తం ఎన్నికల నిర్వహణకు 1126 కేంద్రాలను ఎన్నికల సంఘం కేటాయించింది. దేశంలో తొలిసారి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిల్ ట్రయల్(వీవీపీఎటీ)ను మిజోరం ఎన్నికల్లో ఈసీ వినియోగించింది.
ఆ రాష్ట్ర పోలీసులతో పాటు 7,000 కేంద్ర బలగాలు ఎన్నికల్లో విధులు నిర్వర్తించాయి. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడానికి మిజోరం పీపుల్స్ ఫోరం ప్రధాన కారణం. పది లక్షల జనాభా ఉన్న మిజోరంలో మొత్తం ఓటర్లు 6,90,860 మంది ఉండగా, పురుష ఓటర్లు 3,40,527 మంది ఉన్నారు, మహిళా ఓటర్లు3,50,333 మంది ఉన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉంటుంది.