: బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలని సీఎం తమ్ముడు అమ్ముకుంటున్నాడు: సోమిరెడ్డి
సీఎం వసూళ్లకు పాల్పడుతున్నాడని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి అని అన్నారు. కౌలు రైతులకు 2 వేల కోట్ల రుణాలు ఇస్తామని గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి చివరకు 200 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజీవ్ యువ కిరణాల ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో లెక్క చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ తన అక్రమాస్తులను దాచుకునేందుకు సీఎం సహకరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ నుంచి ఒక్క రూపాయి అయినా రికవరీ చేశారా? అని ప్రశ్నించారు. సీఎం చిత్తూరుకు వెళ్తుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో రాలేదని ఎద్దేవా చేశారు. సాక్షాత్తూ సీఎం తమ్ముడే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని లక్షల రూపాయలకు అమ్ముకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు.