: క్యాన్సర్‌కు కాక్‌టెయిల్ మందు
రొమ్ము క్యాన్సరును నివారించడానికి ప్రత్యేకమైన ఔషధాన్ని పరిశోధకులు రూపొందించారు. నిజానికి మనం వాడే ఆహార పదార్ధాల్లోనే మన రోగాలకు విరుగుడు ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తించలేము. కానీ శాస్త్రవేత్తలు ఈ విషయాలపై పరిశోధనలు సాగిస్తుంటారు. ఈ పరిశోధనల నుండి రూపుదిద్దుకున్నదే సూపర్ కాక్‌టెయిల్. ఈ కాక్‌టెయిల్ రొమ్ము క్యాన్సర్ కణాలను అంతమొందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
లూసియానా విశ్వవిద్యాలయానికి చెందిన మాద్వా రాజ్ అనే శాస్త్రవేత్త సారధ్యంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో పసుపు, కొన్ని రకాల కూరగాయలు, పండ్లు, మొక్కల వేర్లనుండి తయారుచేసిన మిశ్రమానికి రొమ్ము క్యాన్సరు కణాలను అంతమొందించే శక్తి ఉన్నట్టు తేలింది. వృక్ష సంబంధమైన ఆరు రకాలైన మొక్కలనుండి తీసిన ఈ మిశ్రమాన్ని శాస్త్రవేత్తలు సూపర్ కాక్‌టెయిల్‌గా పిలుస్తున్నారు.
ఈ కాక్‌టెయిల్ సాధారణ కణాలకు ఎలాంటి హాని చేయకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే ధ్వంసం చేసే ప్రత్యేకతను కలిగివుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము రూపొందించిన ఈ వృక్ష సంబంధ పదార్ధాల కషాయంతో రొమ్ము క్యాన్సర్ కణాలు నూటికి నూరుశాతం నిర్వీర్యమైపోయినట్టు తెలిపారు. అంతేకాదు ఈ కషాయం వల్ల ఇతర దుష్పరిణామాలేవీ లేవని తమ పరిశోధనలో తేలిందని, అయితే ఈ కషాయంపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.