: జగన్ నేతకో మాట చెబుతున్నాడు: సీఎం రమేష్
వైఎస్సార్ సీపీ అధినేత జగన్ జాతీయ నేతలను కలుస్తున్నానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని టీడీపీ నేత సీఎం రమేష్ మండిపడ్డారు. నిన్న కోల్ కతాలో తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి ఏం చెప్పాడని ప్రశ్నించారు. ఆ పార్టీలో ఉన్న తమ సహచరులు తమకు అన్నీ చెబుతున్నారని సీఎం రమేష్ తెలిపారు. నిన్న కమ్యూనిస్టులను కలిసిన మీరు మా దగ్గరకు మద్దతు కోసం వస్తే ఎలా? అని మమతాబెనర్జీ నిలదీశారని సీఎం రమేష్ వెల్లడించారు.
తమకు బద్ధశత్రువైన సీపీఎంను ఎలా కలిశారని ఆమె ప్రశ్నించారన్నారు. జగన్ బీజేపీ దగ్గరోమాట, ఇంకొకళ్ల దగ్గర మరో మాట చెబుతున్నారని సీఎం రమేష్ దుయ్యబట్టారు. జగన్ లక్ష్యం ఒక్కటేనని తన కేసులు తారు మారు చేసుకోవడమేనని సీఎం రమేష్ తెలిపారు. జగన్ జైలులో ఉన్నప్పడు తల్లి, చెల్లి బాధ్యతంతా నెత్తిన వేసుకున్నారని అన్నారు. అప్పట్లో షర్మిళ జగనన్న వదిలిన బాణాన్నని అన్నారని, ఇప్పడు జగనన్న వదిలేసిన బాణంలా బెంగళూరులో ఉన్నారని అన్నారు. బంధువులకే ఏమీ చేయని జగన్ ప్రజలకు ఏం చేస్తాడని ఆయన ప్రశ్నిచారు.