: ప్రమాదకరమైన తుపాను వచ్చేస్తోంది
చూడబోతుంటే రాష్ట్రంలో అన్నదాతలను నిలువునా ముంచేసేందుకు ప్రకృతి కక్షగట్టినట్లు ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలను పైలిన్ పెను తుఫాను కోలుకోలేని దెబ్బతీసింది. ఆ వెంటే హెలెన్ పగబట్టి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులను ముంచేసింది. ఇప్పుడు లెహర్ అనే మరో తుపాను రాష్ట్రం దిశగా వస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో ఇది తుపానుగా మారి గురువారం నాటికి తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హెలెన్ కన్నా లెహర్ భయంకరమైనదంటూ వారు ముందుగానే హెచ్చరించారు. హెలెన్ ధాటికి కోనసీమ కోలుకోలేకుండా దెబ్బతింది. 60వేల కొబ్బరి చెట్లు నేలకూలాయి. మళ్లీ మామూలు స్థితికి రావడానికి రెండేళ్లు పడుతుంది. ఈ సమయంలో దాని కంటే భయంకరమైన తుపాను రాష్ట్రం దిశగా రావడం ఆందోళన కలిగించేదే.