: శివరాత్రి కోసం పాకిస్తాన్ వెళ్తున్న భారతీయులు!
హిందూ దేశంగా పేరుగాంచిన భారతదేశంలో లెక్కకు మించిన ప్రపంచ ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఉన్నాయి. కాశీలాంటి పుణ్యక్షేత్రాల్లో మరణించే భాగ్యం తమకు కలగాలని హిందువుల ధార్మికభావన. మరోవైపు ఇస్లాం మతానికి కేంద్రంలా వెలుగొందుతున్న పాకిస్తాన్లో హిందూ దేవాలయాలు తక్కువ.
ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడానికి ఓ హిందూ భక్త బృందం పాకిస్తాన్ కు పయనమయ్యింది. ఆశ్చర్యకరంగా అనిపించే ఈ వార్త మూలాల్లోకి వెళితే, పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం కటాస్ గ్రామంలో ఓ శివాలయం ఉంది.
దీనిని కటాస్ రాజ్ దేవాలయం అంటారు. మహాభారత కాలంలో అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు కొన్నాళ్లు ఇక్కడ గడిపారనేది స్థలపురాణం. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయ పునరుద్ధరణకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే భారీ మొత్తంలో నిధులు కేటాయించడంతోపాటు ప్రపంచవారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
మహాశివరాత్రి రోజున పాక్ లోని హిందువులంతా దర్శించుకొనే ఈ ఆలయాన్ని సందర్శించడం కోసం భారతీయ హిందూ భక్త బృందం పయనమయింది. వాఘా సరిహద్దు ద్వారా ఈ బృందం ఈ రోజే పాక్ చేరుకుంటుంది. కాగా శరణార్ధుల ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు సీనియర్ అధికారులు వాఘా సరిహద్దు దగ్గర నుంచీ ఈ భక్త బృందం ఆలనా పాలనా చూసుకుంటారు.