: చక్కెరకు చెక్ చెప్పే ఊదారంగు కొవ్వు కణాలు
అవి కూడా కొవ్వు కణాలే! కాపోతే.. శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్నటువంటి ఊదారంగులోని ఓ కొత్త రకం ప్రత్యేకమైన కొవ్వు కణాలు. ఇలాంటి బ్రౌన్ ఫ్యాట్ స్టెమ్ సెల్స్ పెద్దవయసులోని మనుషుల్లోనూ ఉంటాయని, వీటిని చక్కెర వ్యాధి, ఊబకాయం సమస్యలకు సంబంధించిన చికిత్సల్లో వినియోగించవచ్చునని... భారతీయ సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త పరిశోధనల్లో వెల్లడైంది. ఇప్పటిదాకా ఇలాంటి బ్రౌన్ ఫ్యాట్ స్టెమ్ సెల్స్ పెద్దవారిలో ఉండవు అని భావిస్తూ వచ్చారు. సాధారణంగా పసిపిల్లల్లో ఇలాంటి బ్రౌన్ ఫ్యాట్ స్టెమ్ సెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. అవి మెటబాలిజం పరంగా బాగా యాక్టివ్‌గా ఉంటాయనేది నమ్మకం. అందువల్లనే పిల్లలు ఎంత ఎక్కువగా తింటున్నప్పటికీ కూడా సాధారణంగా బరువు పెరిగేది చాలా తక్కువగా ఉంటుంది. సరిగ్గా పిల్లల మెటబాలిజంను ఆ క్రమంలో పనిచేయించే ఈ బ్రౌన్ ఫ్యాట్ స్టెమ్ సెల్స్ పెద్దల్లో కూడా ఉంటాయని వాటిని సవ్యంగా ఉపయోగించి రోగాలను నియంత్రించవచ్చునని శాస్త్రవేత్తలు తేలుస్తున్నారు.
యూనినిర్సిటీ ఆఫ్ ఉటా స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన అమిత్ ఎన్ పటేల్ ఈ దిశగా కీలకంగా జరిగిన పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్నారు.
సాధారణంగా మనుషులు పెద్దవాళ్లయ్యే కొద్దీ.. తెల్లకొవ్వుకణాలు పెరిగి బ్రౌన్ కొవ్వు కణాలు తగ్గుతుంటాయి. అందుకే ఇదే చక్కెర వ్యాధికి, కొలెస్టరాల్‌కు కారణం అవుతుంటుంది. మీలో బ్రౌన్ కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటే.. మీరు మెటబోలిగ్గా బాగున్నట్లు లెక్క. మీరు తక్కువ బరువుంటారు. కొలెస్టరాల్ సమస్య ఉండదు అని పటేల్ చెబుతున్నారు. ప్రయోగదశలో ఇలాంటి కణాలను అభివృద్ధి చేసి శరీరంలో ప్రవేశపెట్టి పరీక్షించామని, గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా అవి చూస్తున్నట్లు తేలిందని పటేల్ వివరిస్తున్నారు.