: తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలి: మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయ స్థిరత్వం కోసం అసెంబ్లీ స్థానాలను పెంచాలని మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్ సభ స్థానానికి తొమ్మిది చొప్పున తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 153కు పెంచాలన్నారు. హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంత ప్రతిపాదన అసహజమన్నారు. అలాగని హైదరాబాదును దీర్ఘకాలం ఉమ్మడి రాజధాని చేయడంవల్ల సీమాంధ్రులకే నష్టమని చెప్పుకొచ్చారు. హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సాయంత్రం సమావేశమై చర్చించారు. అనంతరం మీడియాతో శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెంచాలని హైకమాండ్ ను కోరేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు వెల్లడించారు.