: అర్ధం చేసుకోవడంలో కూడా ఆడా, మగా తేడానా?
మనకు రోజూ బోలెడు మంది బోలెడు విషయాలను చెబుతుంటారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే మనకు బాగా జ్ఞాపకం ఉంటాయి. మాట్లాడే వ్యక్తి మహిళా, లేక పురుషుడా? అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మాట్లాడే వ్యక్తి లింగభేదాన్ని బట్టి వారు మాట్లాడుతున్న మాటల్లోని పదాలు, వాక్యనిర్మాణం, వ్యాకరణ ప్రయోగాన్ని అర్థం చేసుకునే స్థాయి ఉంటుందని పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
కన్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు భాషలోని పదాలను, వ్యాకరణ లింగాన్ని శ్రోతలు అర్థం చేసుకోవడంలో కూడా మాట్లాడే వ్యక్తి ఏ లింగానికి చెందిన వారనే అంశం ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. వీరు స్పానిష్ భాషను వినిపించి కొందరిపై పరిశోధన చేయగా అదివిన్న వారు పదాలు ఏ లింగానికి చెందినవో వేగంగా, కచ్చితంగా అర్థం చేసుకోవడంలో వక్త ఎవరన్నదీ కీలకంగా నిలిచినట్టు తేలింది. పదం, వక్త ఒకే లింగానికి చెందినవారైతే శ్రోతలు తొందరగా అర్థం చేసుకోగలుగుతున్నట్టు పరిశోధకులు తమ పరిశోధనలో గుర్తించారు. భాషను మెదడు అర్థం చేసుకునే ప్రక్రియలో మాట్లాడే వ్యక్తి మాండలికం, లింగం తప్ప ఇంకేవీ ప్రదాన పాత్రను పోషించవని, శబ్దాలను మెదడు అమూర్త రూపంలో నిల్వ చేసుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.