: 'భారతరత్న' విషయంలో ప్రధాని, సచిన్ పై కేసు
సచిన్ టెండుల్కర్ కు భారతరత్న ప్రకటించడంపై వివాదం రగులుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, కేంద్ర క్రీడాశాఖ మంత్రి భన్వర్ జితేంధ్ర సింగ్, సచిన్ లపై ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ కేసు వేశారు. ఈ మేరకు మాస్టర్ ను నిందితుడిగా పేర్కొంటూ భారతీయ శిక్షా స్మృతి కింద 420 (మోసం, వంచనకు సంబంధించిన నేరాలు), 419 (మోసగించినందుకు శిక్ష), 417,504, 120 (బి) కింద కేసులు నమోదు అయ్యాయి. దేశ అత్యున్నత పురస్కారానికి టెండుల్కర్ ను ఎంపికచేసి, లెజండరీ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ ను ఎంపిక చేయకుండా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై డిసెంబర్ 10న కోర్టు విచారణ చేపట్టనుంది.