: ఈడు మామూలోడు కాదు
'మొగుడంటే మొగుడు కాదు నా మొగుడు' అంటూ సదరు భార్య పెళ్లయిన తర్వాత పాడుకోవాల్సిందే. ఎందుకంటే కాబోయే భార్యకు పెద్ద మొత్తంలో నగదును బహుమతిగా ఇచ్చిపంపాడు. మనం మామూలుగా సినిమాల్లో .. 'నీకోసం పెద్ద వజ్రాన్ని కొనాలనుకున్నాను. కానీ నువ్వే పెద్ద వజ్రంగా నాకు అనిపించావు' అంటూ హీరో చెప్పడం మనం వింటుంటాం. అలాకాకుండా 'నీపై నా ప్రేమను ఎలా తెలుపనూ' అనుకున్నాడో ఏమో సదరు పెళ్లికొడుకు. కాబోయే భార్యకు పెద్ద మొత్తంలో నగదును కానుకగా పంపించాడు.
చైనాలోని జెజియాంగ్ రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు తన కాబోయే భార్యకు కానుకగా సుమారు 9.3 కోట్ల రూపాయలను (8.88 మిలియన్ యువాన్లు) నిశ్చితార్థం బహుమతిగా పంపించాడు. 102 కేజీల బరువున్న ఈ నోట్ల కట్లలను వెదురు బుట్టల్లో నింపి 18 మంది మోసుకెళ్లారని చైనాలోని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. తన కాబోయే భార్యపై అంత మక్కువ పెంచుకుని ఖరీదైన కానుకను పంపిస్తే ఈ వార్త చదివిన కొందరు మాత్రం పెళ్లికి అంత దుబారా పనికిరాదంటూ విమర్శిస్తున్నారట. అయినా ఎవరి ఆనందం వారిది. కాదంటారా...?