: నేడు ఢిల్లీకి తెలంగాణ, సీమాంధ్ర మంత్రులు
తెలంగాణ, సీమాంధ్రకు చెందిన పలువురు మంత్రులు ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన మంత్రులు శైలజానాధ్, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి తదితరులు ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్న వారిలో ఉన్నారు. రేపు ఉదయం పితాని సత్యనారాయణ, మరికొందరు వెళ్లనున్నారు. ఇక తెలంగాణకు చెందిన మంత్రులు కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. వీరు రేపు సాయంత్రం కేంద్ర మంత్రుల బృందంతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి రాజధాని పరిధిని హైదరాబాద్ రెవెన్యూ జిల్లా వరకే పరిమితం చేయటం, భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను తెలంగాణలోనే ఉంచటం, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని తెలంగాణకే కేటాయించడం వంటి డిమాండ్లను తెలంగాణకు చెందిన మంత్రులు జీవోఎంకి వినిపించి, ఒక నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.