: యాభై గంటలు గంటకు సమానం
యాభై గంటలు ఒక గంటతో సమానం. ఎలా అంటే యాభై గంటల నడక గంటపాటు చేసే కఠిన వ్యాయామానికి సమానం అవుతుంది. యాభై గంటలపాటు నడిస్తే కరిగే కొవ్వుకు ఒక గంటపాటు తీవ్రంగా వ్యాయామం చేస్తే కరిగే కొవ్వుకు సమానమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా మనం నడకకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటాము. శరీర భాగాల్లో అదనంగా పేరుకుపోయిన కొలెస్టరాల్ నడక ద్వారా కరుగుతుందని మనం అనుకుంటాం. నడిస్తే చాలా నిదానంగా కొవ్వు కరుగుదల ఉంటుంది. అలాకాకుండా యాభై గంటలపాటు నడిస్తే ఎంత కొవ్వు కరుగుతుందో గంటపాటు తీవ్రతరమైన వ్యాయామాలు చేస్తే అంత కొవ్వు కరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు యాభై గంటలపాటు నడక ఇచ్చే ప్రయోజనాన్ని ఒక గంటపాటు తీవ్రంగా శ్రమించి చేసే వ్యాయామం ఇస్తుందని చెబుతున్నారు. వీరు నిర్వహించిన పరిశోధనల్లో వ్యాయామం తాలూకు ప్రభావాన్ని పరిశోధకులు పరిశీలించారు. శరీర బరువు, కొలెస్టరాల్ శాతం, నడుము, పిరుదుల భాగంలో పేరుకుపోయిన కొవ్వు శాతాన్ని తగ్గించడం వంటి వాటికి తీవ్రతరమైన వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారిని పరిశోధకులు తమ పరిశోధనల నిమిత్తం ఎంపిక చేసుకున్నారు.
వారిని రెండు బృందాలుగా విభజించారు. ఒక బృందంతో రోజుకు గంటపాటు నిర్విరామంగా తీవ్రమైన, కష్టతరమైన వ్యాయామాలను చేయించారు. సర్య్యూట్ శిక్షణ, బాక్సింగ్ వంటి వాటిని చేయించారు. రెండవ బృందంతో వారం రోజుల పొడవునా రోజూ కచ్చితంగా నడిచేలా ఏర్పాటు చేశారు. ఈ రెండు బృందాల ఆరోగ్య పరిస్థితి తీరుతెన్నులను పరిశీలించిన మీదట రోజుకు గంటపాటు చేసిన కష్టతరమైన వ్యాయామలే ఎక్కువ ఫలితాలను ఇచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి అధిక కొలెస్టరాల్ సమస్యతో బాధపడేవారు రోజూ నడకకన్నా కాస్త కష్టమైనా రోజుకు గంటసేపు కఠినమైన వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించి చూడండి.