: దేశం గర్వించదగ్గ మేధావి.. 'భారతరత్న' సీఎన్ఆర్ రావు
సచిన్ తో పాటు భారతరత్నకు ఎంపికైన ప్రముఖ శాస్త్రవేత్త, ప్రధాని సాంకేతిక సలహాదారు సీఎన్ఆర్ రావు 1934 లో బెంగళూరు (బ్రిటీష్ ఇండియా)లో జన్మించారు. ఈయన పూర్తి పేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. ఈయన 1951లో మైసూరు యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందారు. అనంతరం బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1958లో అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో పుర్డ్యూ యూనివర్శిటీలో పీహెచ్ డీ పూర్తిచేశారు. అనంతరం 1961లో మైసూరు యూనివర్శిటీ నుంచి మరో డాక్టరేట్ సంపాదించారు. 1963లో కాన్పూర్ ఐఐటీలో ప్రొఫెసర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
సాలిడ్ స్టేట్, స్ట్రక్చరల్ కెమిస్ట్రీలో సీఎన్ఆర్ రావు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కెమిస్ట్రీలో ఈయన చేసిన కృషిని గుర్తించిన ఎన్నో యూనివర్సిటీలు రావును డాక్టరేట్ లతో సత్కరించి, గౌరవించాయి. వీటిలో ఆక్స్ ఫర్డ్, కొలరాడో, ఖార్టూమ్, లివర్ పూల్, నార్త్ వెస్టర్న్, కీన్, నొవోసిబిర్స్క్, పుర్డ్యూ, స్టెలెన్ బాష్, జోసెఫ్ ఫోరియర్, వేల్స్, రోక్లా, నోటర్ డేమ్, ఉప్సలా ఉన్నాయి. వీటితో పాటు బెనారస్, బెంగాల్ ఇంజినీరింగ్, బెంగళూరు, అన్నా, ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, బుర్ ద్వాన్, బుందేల్ ఖండ్, ఢిల్లీ, హైదరాబాద్, మైసూరు, మణిపూర్, లక్నో, కువెంపు, కోల్ కతా, కర్ణాటక, ఇగ్నో, ఉస్మానియా, పంజాబ్, రూర్కీ, సిక్కిం మణిపాల్, తుమకూరు, శ్రీ వెంకటేశ్వర, విద్యాసాగర్, విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ, ఐఐటీ - బాంబే, ఖరగ్ పూర్, ఢిల్లీ యూనివర్శిటీలు ఈయన్ను డాక్టరేట్ లతో గౌరవించాయి.
ప్రస్తుతం ఈయన జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రీసర్చ్ లో నేషనల్ రీసర్చ్ ప్రొఫెసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్, పుర్డ్యూ యూనివర్శిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు. సాలిడ్ స్టేట్, స్ట్రక్చరల్ కెమిస్ట్రీ విభాగంలో భారతరత్న సీఎన్ఆర్ రావు ప్రపంచంలోని అతిగొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరుగాంచారు. ఐదు దశాబ్దాలుగా ఈ విభాగంలో ఆయన ఎనలేని కృషి చేశారు. గత రెండు దశాబ్దాలుగా నానో టెక్నాలజీపై కూడా ఆయన విశేష కృషి చేశారు. ఇప్పటిదాకా ఆయన 1500 రీసర్చి పేపర్లను రాశారు. దీనికి తోడు 45 పుస్తకాలను రచించారు.
సీఎన్ఆర్ రావు తన మేథాసంపత్తితో మన దేశ పేరుప్రతిష్ఠలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. భారతావనికి ఈయన చేసిన కృషికి ప్రతిఫలంగా... భారత ప్రభుత్వం ఈయన్ను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఈయన ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పొందారు. 2000 సంవత్సరంలో రాయల్ సొసైటీకి చెందిన 'హ్యూజెస్ మెడల్'ను పొందారు. సైన్స్ విభాగంలో ఈ అవార్డును పొందిన ప్రథమ భారతీయుడిగా గుర్తింపు పొందారు. దీంతోపాటు, టెల్ అవీవ్ యూనివర్శిటీకి చెందిన 'డేన్ డేవిడ్ ప్రైజ్'ను సొంతం చేసుకున్నారు. అలాగే ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత అవార్డు 'షెవలియర్ డీ లా లీజియన్ డీఆనర్'ను కూడా పొందారు. వీటికితోడు ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది.