: సచిన్ బ్యాటింగ్ వీక్షిస్తున్న రాహుల్ గాంధీ, వెంకటేష్, మహేష్ బాబు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు వాంఖడే స్టేడియం వద్ద ప్రముఖులు బారులు తీరారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిట్టచివరి బ్యాటింగ్ విన్యాసాలు ప్రత్యక్షంగా తిలకించేందుకు భారత జట్టుకు ఆడిన మాజీ క్రికెటర్లు, సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు రాహుల్ గాంధీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ వాంఖడే స్టేడియానికి విచ్చేశారు. ప్రముఖ టాలీవుడ్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు సచిన్ బ్యాటింగ్ చూసేందుకు వాంఖడే స్టేడియానికి వెళ్లారు. క్రికెట్ అంటే చెవి కోసుకునే వెంకీ భారత జట్టు పాల్గొనే ప్రతి కీలక మ్యాచ్ వీక్షిస్తుంటారు. ప్రముఖులు భారీ సంఖ్యలో స్టేడియానికి రావడంతో ముంబై పోలీసులు వాంఖడే స్టేడియానికి భారీ భద్రత కల్పించారు. సచిన్ చివరి ఇన్నింగ్స్ వీక్షించేందుకు ప్రముఖులు పోటీ పడడంతో సగటు అభిమాని కొంత అసౌకర్యానికి గురయ్యారు.