: సచిన్ కోసం కామెంటేటర్ గా మారిన అమీర్ ఖాన్
సచిన్ చివరి టెస్టు అనేక విశేషాలకు వేదికైంది. సచిన్ తల్లి తొలిసారి అతని ఆటను ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా, సచిన్ గురువు రమాకాంత్ ఆచ్రేకర్ వీల్ ఛెయిర్ లోనే మ్యాచ్ కు హాజరయ్యారు. కాగా బ్రియాన్ లారా వంటి దిగ్గజాలు, పలువురు బాలీవుడ్ నటులు కూడా సచిన్ ఇన్సింగ్ చూసేందుకు తరలి వచ్చారు. ఈ మ్యాచ్ లో మరో విశేషం కూడా చోటు చేసుకుంది. మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కామెంటేటర్ గా మారాడు.
క్రికెట్ కామెంటేటర్లు రవిశాస్త్రి, హర్షాభోగ్లేతో కలసి అమీర్ ఖాన్ కామెంటరీ చెబుతూ తనకు సచిన్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ధూమ్-3 సినిమాలోని 'ధూమ్ మచాలే' పాటను క్రికెట్ దిగ్గజం సచిన్ కు అంకితమిచ్చిన సంగతి తెలిసిందే. అమీర్ నటించిన ధూమ్-3 ప్రమోషన్ ఈ రోజు 4 గంటలకు ఉండగా, దాన్ని సాయంత్రం 6 గంటలకు అమీర్ వాయిదా వేసుకున్నాడు. విండీస్ ఆలౌట్ అయిందనే వార్త విన్న ఆయన షూటింగ్ స్పాట్ లోని అన్ని పనులను వదిలేసి... తాను అదృష్టంగా భావించే బ్లూ టీషర్టు వేసుకుని స్టేడియంలోకి అడుగు పెట్టారు.