: కేటీఆర్.. రాజకీయాల్లో నువ్వు బచ్చా : సోమిరెడ్డి
'కేటీఆర్.. రాజకీయాల్లో నువ్వు బచ్చావి... ఆ విషయం తెలుసుకో' అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, 'ఉద్యమకారుల మరణాలను కూడా కుటుంబ ప్రయోజనాలకు వాడుకునే మీరా, టీడీపీని విమర్శించేది?' అని మండిపడ్డారు. ఇదిలా ఉంచితే, తాజాగా కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టు మీద ఆరోపణలు చేసి వసూళ్లు చేసుకుందామనుకున్నాడని... అయితే మెట్రో ఎండీ ఇచ్చిన వివరణ, ఆయన చేసిన సవాలుకు భయపడి కనీసం ఖండించే ధైర్యం కూడా చేయలేకపోయాడని అన్నారు. కేవలం కుటుంబ ప్రయోజనాల కోసం పెట్టుకున్న పార్టీ టీఆర్ఎస్ అని... అది చెప్తే వినే స్థితిలో తమ పార్టీ లేదని చెప్పారు.
లగడపాటి, ఉండవల్లిలు తమ దగ్గర స్టార్ బ్యాట్స్ మెన్ ఉన్నాడని చెప్తూ ఉంటారని... మ్యాచ్ మొత్తం ముగిసిన తర్వాత ఆ బ్యాట్స్ మెన్ ఫీల్డులోకి దిగుతాడా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలన్నీ నిజమే అయితే... స్టార్ బ్యాట్స్ మెన్ ను వెంటనే బరిలోకి దించి, విభజన ఆపాలంటూ సవాలు విసిరారు.
కాఫీ తాగడానికి కూడా పది నిమిషాలు పడుతుంది... అలాంటిది విభజనపై పది నిమిషాల్లో మీ వాదనలు చెప్పమని రాజకీయ పార్టీలను బయటకు పంపేశారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా విభజించాలనుకుంటుందో ముందు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.