: కర్ణాటకలోని హవేరి సమీపంలో ఘోర బస్సు ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం
కర్ణాటక హవేరి జిల్లాలోని కునుమళ్లహళ్లి వద్ద నేషనల్ ట్రావెల్స్ కు చెందిన కేఏ 01 ఏసీ 8642 నంబరు బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనమయ్యారు. 25 మందికి గాయాలయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే చాలా మంది ప్రయాణికులు అప్రమత్తమై బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు దూకడంతో తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఈ దుర్ఘటన ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగింది. కునుమళ్లహళ్లి వద్ద బస్సు రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో టైరు పేలి ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
క్షతగాత్రులను హుబ్లీలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హవేరి ఎస్పీ శశికుమార్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సు 140-150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు సమాచారం. బెంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న ఈ బస్సు బుధవారం రాత్రి 8.00 గంటలకు బెంగళూరులో బయలుదేరింది.