: ఉమ్మడి రాజధానిని హైదరాబాద్ జిల్లాకే పరిమితం చేయాలి : డిప్యూటీ సీఎం
ఉమ్మడి రాజధానిని హైదరాబాద్ రెవెన్యూ జిల్లా వరకే పరిమితం చేయాలని జీవోఎంకు సూచించినట్టు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో అసెంబ్లీ, సెక్రటేరియట్, ట్రాన్స్ కో, జెన్ కో, హైకోర్టు, ఉద్యోగుల క్వార్టర్స్ అన్నీ ఉన్నాయని... అందుకే ఉమ్మడి రాజధాని పరిధిని పెంచరాదని అన్నారు. అంతేకాకుండా, ఉమ్మడి రాజధానిని ఐదేళ్లు దాటి ఉంచకూడదని కూడా చెప్పినట్టు తెలిపారు. సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారం, హైదరాబాద్ సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణనే ఏర్పాటు చేయాలని జీవోఎంను కోరినట్టు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను గుర్తించాలని అన్నారు. భద్రాచలంను సీమాంధ్రకు ఇస్తే సమస్యలు తలెత్తుతాయని జీవోఎంకు సూచించామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆంధ్రా ప్రాంతానికి అవసరమైన ప్యాకేజీ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఉద్యోగుల విషయంలో 371-డి ని కొనసాగించాలని కోరినట్టు చెప్పారు.