: మీది కూర్చుని చేసే ఉద్యోగమా... అయితే జాగ్రత్త!


మీది ఎక్కువ సేపు కూర్చుని చేసే ఉద్యోగమా... అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోజులో ఎక్కువభాగం కూర్చుని ఉండేవారికి పెద్ద పేగులో బొడిపెలు(పాలిప్స్‌) తిరగబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చుని ఉద్యోగాలు చేసేవారిలో స్థూలకాయం సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కొందరు నడవడం, పరుగెత్తడం వంటి వ్యాయామాలు చేస్తుంటారు. ఇలాంటివి చేసినా కూడా ఎక్కువసేపు కూర్చునే ఉండేవారిలో మాత్రం పాలిప్స్‌ సమస్య తప్పటంలేదని నిపుణులు చెబుతున్నారు.

ఈ పాలిప్స్‌ను పెద్దపేగులో వచ్చే క్యాన్సర్‌ను గుర్తించేందుకు చేసే కొలనోస్కోపీ పరీక్షలో గుర్తించడం జరుగుతుంది. ఆ సమయంలో వాటిని తొలగించవచ్చు. అయినా కూడా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అవి మళ్లీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అమెరికాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ పాలిప్స్‌ ఏర్పడడం అనేది రోజుకు 7 గంటలకంటే తక్కువ సమయం కూర్చునే వారితో పోల్చితే 11 గంటలకంటే ఎక్కువ సమయం కూర్చునే వారిలోనే 45 శాతం ఎక్కువగా ఉన్నట్టు, అందునా మహిళలకన్నా మగవారిలోనే ఈ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

వీటివల్ల అప్పటికి పెద్దగా ప్రమాదం లేకున్నా తర్వాత కాలంలో పెద్ద పేగుకు క్యాన్సర్‌ వచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రోజూ ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినా ఇవి ఏర్పడకుండా చూసుకుంటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే ప్రజారోగ్య సిఫారసుల్లో ఎక్కువసేపు కూర్చోవడాన్ని తగ్గించాలనే అంశాన్ని కూడా చేర్చాలని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టైన్‌ మోల్‌మెంటీ సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News