: కేంద్రాన్ని కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విభజన పిటిషన్ల విచారణ వాయిదా
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు విచారణ వాయిదా వేసింది. విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. విభజన ప్రకటన కారణంగా రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా భాగస్వాములను సంప్రదించకుండానే ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారంటూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.
రాజకీయ నిర్ణయమని పేర్కొంటూనే ఇందులో కార్యనిర్వాహక వ్యవస్థనూ భాగస్వామిగా చేసి కేంద్రం విభజన చేపడుతోందని పిటిషనర్ తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఇంకా ప్రభుత్వ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు కదా? అని ప్రశ్నించింది. దీంతో పత్రికలు ప్రచురించిన కథనాలు తమ వద్ద ఉన్నాయని పిటిషనర్ చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం, వాటిని ఆధారాలుగా స్వీకరించలేమని స్పష్టం చేసింది.
సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని సంబంధిత అధికార ప్రకటన పొందవచ్చని సూచిస్తూ, సదరు ఆధారాన్ని తమకు సమర్పించాలని పిటిషనర్ కు సూచించింది. మరో వైపు దీనిపై వివరణతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది.