: కిడ్నాప్ బాలుడి కథ సుఖాంతం..క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు
హైదరాబాదు పాతబస్తీ రికాబ్ గంజ్ ప్రాంతాంలో రెండున్నరేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన గోపాల్ మాజీ, అర్చనా మాజీ దంపతులు రికాబ్ గంజ్ లో బంగారు నగల పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి సమీప బంధువైన రాంప్రసాద్ తన ప్రియురాలితో కలిసి గోపాల్ మాజీ కుమారుడైన ఆకాశ్ మాజీకి మాయమాటలు చెప్పి అపహరించుకుపోయాడు. మూడు కిలోల బంగారం ఇస్తేనే బాలుడిని అప్పగిస్తామని ఫోన్లో బెదిరించాడు. దీంతో బాలుడి తండ్రి చార్మినార్ పోలీసులను ఆశ్రయించాడు. కోల్ కతా పోలీసుల సహకారంతో స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్ని అరెస్టు చేశారు. మీడియా సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు కోసం కోల్ కతా వెళ్లిన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.