: హరియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ తో పాక్ కీలక నేత భేటీ... కేంద్రంపై బీజేపీ సీరియస్
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సలహాదారుడు సర్తాజ్ అజీజ్ ఈ రోజు ఢిల్లీలో కాశ్మీర్ విభజనను కోరుకుంటున్న వారితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయంలో, హరియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ ఉమర్ ఫరూక్ తో అజీజ్ సమావేశమయ్యారు. ఈ ఘటనపై బీజేపీ విరుచుకుపడింది. కాశ్మీర్ ను భారత్ నుంచి వేరుచేయాలని కోరుకుంటున్న వారితో పాక్ ప్రధాని సలహాదారుడు భేటీ అయితే... కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. ఇలాంటి వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని అన్నారు. పాక్ మొదట్నుంచి కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోందని... కొద్ది రోజుల క్రితం కూడా అమెరికా పర్యటనలో నవాజ్ షరీఫ్ ఇలాంటి ప్రయత్నాలే చేశారని తెలిపారు. సరిహద్దు రేఖ వద్ద పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతి రోజూ ఉల్లంఘిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం చేతులు ముడుచుక్కూర్చుందని ఎద్దేవాచేశారు. పాక్ విషయంలో కాంగ్రెస్ పాలసీ ఏమిటనే విషయం అర్థం కాకుండా ఉందని రాజ్ నాథ్ అన్నారు.
పాకిస్థాన్ లో కొత్త ప్రభుత్వం కొలువుతీరడం వల్లే... తాము పాక్ సలహాదారుడితో సమావేశమయ్యామని హరియత్ ఛైర్మన్ ఉమర్ ఫరూక్ తెలిపారు. కాశ్మీర్ విషయంలో పాక్ ప్రభుత్వం తీసుకోబోయే స్టాండ్ ను తెలుసుకోవడానికే భేటీ అయ్యామని అన్నారు. ఈ వ్యవహారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.