: కిడ్నీ అమ్మేశాడు... ఆ డబ్బుతో ఐఫోన్ కొనుక్కున్నాడు
అసలే పేదరికంతో సతమతమయ్యే కుటుంబం. రోజూ పనికోసం పొరుగూరికి వెళ్లి పనిచేసుకుని డబ్బు సంపాదించి వచ్చిన డబ్బుతో కుటుంబం జీవించాలి. ఇలాంటి కుటుంబంలో పుట్టిన తర్వాత ఐఫోన్ లాంటి ఖరీదైన వస్తువుల పేర్లు వినడం, బొమ్మల్లోనో, ఇతరుల చేతుల్లోనో చూడడం మినహాయించి స్వంతంగా కొనడం అనేది జరిగేది కాదు. ఏం చేయాలో తోచదు... ఐపాడ్ కొనాలనే ఆశ... చివరికి ఒక కుర్రాడు తన కిడ్నీని బేరం పెట్టి అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో ఐఫోన్ కొనుక్కున్నాడు.
చైనాలోని అన్‌హుయ్ ప్రావిన్స్‌లో నివసించే 17 ఏళ్ల వాంగ్ అనే పేద కుర్రాడికి ఐఫోన్, ఐపాడ్ అంటే చాలా ఇష్టం. వాటిని కొనడానికి తనవద్ద డబ్బు లేదు. దీంతో ఎవరో చెప్పడంతో తన కిడ్నీని 3వేల 5 వందల డాలర్లకు అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో తాను కోరుకున్న రెండింటినీ తీసుకుని ఇంటికి వచ్చాడు. అంత విలువైన వస్తువులు ఎక్కడినుండి వచ్చాయని తల్లి నిలదీయడంతో చివరికి అసలు విషయం తెలిసింది. ఈ విషయం కోర్టుదాకా వెళ్లింది. వాంగ్ కిడ్నీని ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టరుకు 20 వేల యెన్‌లు అందాయట. అవయవాల అక్రమ వ్యాపారం ఇలాంటి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడడం చైనాలో మామూలుగా జరుగుతోంది.