: నా స్టాండ్ మారలేదు... నేను సమైక్యవాదినే: సీఎం కిరణ్
తన స్టాండ్ ఇప్పటికీ మారలేదని, తాను ఎప్పటికీ సమైక్య వాదినేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ భావాన్ని ఉద్యమం జరుతున్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ తామెవరూ కించపరచలేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విడదీయలేని సమస్యలు చాలా ఉన్నాయని, అవి పరిష్కారం అయిన తరువాత విభజన అంటే బాగుంటుందని ఆయన తెలిపారు. త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయని సీఎం చెప్పారు.
విభజనపై కేంద్రం చర్చలు జరుపుతోందని... అందువల్ల దీని గురించి మరింత లోతుగా చర్చించలేమని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో మేం సంయమనం పాటించాం. సమస్యలు పరిష్కారం అయిన తరువాతే విభజన చేయమని సూచిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిన తరువాతే విభజన చేయాలంటున్నామని ఆయన స్పష్టం చేశారు.