: అత్యాచారాలు అరికట్టేందుకు మహిళా ట్యాక్సీలు
దేశరాజధాని న్యూఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాల్లో సింహభాగం ట్యాక్సీ, ఆటో డ్రైవర్లే ఉండడంతో వాటిని ఎలా అరికట్టాలా? అని ఆలోచించిన ప్రభుత్వాలకు ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. దీంతో మాతృస్వామ్య రాష్ట్రం కేరళలో పూర్తిగా మహిళలే నిర్వహించే ట్యాక్సీలను ప్రారంభిస్తున్నారు. 'షి ట్యాక్సీ' పేరుతో పిలిచే ఈ టాక్సీల యజమానులు, డ్రైవర్లు, నిర్వాహకులు అందరూ మహిళలే ఉంటారు. ఇవి రోజుకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. జెండర్ పార్క్ అనే సంస్థ వీటిని నిర్వహిస్తుంది.
మొట్ట మెదటి మహిళా ట్యాక్సీని ఈ నెల 19 న తిరువనంతపురంలో ప్రారంభిస్తారు. ఆ రోజు ఐదు కార్లను తొలి విడతగా ప్రవేశపెడతారు. మూడు నెలల్లోగా వీటి సంఖ్య వందకు చేరుకుంటుందని భావిస్తున్నారు. తరువాతి దశలో కొచ్చి, కోజికోడ్ నగరాలకు విస్తరిస్తారు. జెండర్ పార్క్ సంస్థకు ప్రత్యేకంగా తెలుపు, గులాబిరంగు ట్యాక్సీలను మారుతి సుజుకి సరఫరా చేస్తుంది. వీటిలో జీపీఎస్, అత్యవసర అలారం, కారులోనే వినోదం, ఇతర అధునాతన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయి. జెండర్ పార్క్ సంస్థ లబ్ది దారులను గుర్తించి వారికి కేరళ రాష్ట్ర మహిళాభివృద్ధి కార్పోరేషన్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించి మహిళా డ్రైవర్లను ఎంచుకుంటుంది.
వీరికి వైద్యబీమా, ఆత్మ రక్షణ పద్దతుల్లో శిక్షణ కూడా ఇస్తారు. ఈ ట్యాక్సీలు నడిపేవారికి నెలకు 20 వేలు ఆదాయం లభిస్తుందని జెండర్ పార్క్ వర్గాలు చెబుతున్నాయి. నెలకు 22 రోజులు రోజుకు 8 గంటల పాటు ట్యాక్సీలను డ్రైవర్లు నడపాల్సి ఉంటుందని వారు తెలిపారు.