: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్
రోహిత్ శర్మ గత కొంత కాలంగా క్రికెట్ పండితులు భారత భావి క్రికెట్లో సంచలన తారగా వెలుగొందుతాడని ప్రశంసించిన క్రికెటర్. సచిన్ రిటైర్మెంట్ తో బాధ్యత తెలిసిందో, లేక ఇక క్రికెట్లో తాను నిరూపించుకోవాల్సిందే అనుకున్నాడో తెలియదు కానీ గత కొంత కాలంగా తిరుగులేని ఆటతీరుతో భారత్ కు సునాయాస విజయాలను అందిస్తున్నాడు. ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో డబుల్ టన్ సాధించిన రోహిత్ విండీస్ పై అదే జోరు కొనసాగించాడు. సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ చేరుతున్నా చెక్కు చెదరని ఏకాగ్రతతో సెంచరీ సాధించాడు.
రోహిత్ నిలదొక్కుకోకుంటే భారత్ ఇన్నింగ్స్ కుప్పకూలేదే. రోహిత్ కు అశ్విన్ జత కలవడంతో స్కోరు బోర్డును వన్డే తరహాలో పరుగులెత్తించి మెరుగైన స్థితిలో ఉంచాడు. రోహిత్ అసాధారణ బ్యాటింగ్ కు అశ్విన్ సమయోచిత ఇన్నింగ్స్ జతవ్వడంతో విండీస్ కు మెరుగైన విజయలక్ష్యాన్ని టీమిండియా నిర్ధేశించింది. బౌలర్లు తమ బంతుల పదును చూపడంతో విండీస్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. దీంతో మూడు రోజుల్లోనే తొలి టెస్టు భారత జట్టు వశమైంది. దీంతో టాప్ స్కోరర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు బహూకరించారు.