: సీఎంను మార్చే ఆలోచన లేదు : దిగ్విజయ్
ముఖ్యమంత్రి మార్పుపై వెల్లువెత్తుతున్న పుకార్లకు దిగ్విజయ్ సింగ్ ముగింపు పలికే ప్రయత్నం చేశారు. సీఎంను మార్చే అవకాశం లేదని ఆయన ఢిల్లీలో చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చే విషయంపై కాంగ్రెస్ సమన్వయ కమిటీ మీటింగ్ లో చర్చించమని అన్నారు. మీటింగ్ అజెండాలో ఆ విషయం లేదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రికి ఏ విషయం గురించైనా, ఏదైనా మాట్లాడే వెసులుబాటు ఉంటుందని దిగ్విజయ్ తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు, ఆయన కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులని అన్నారు.
తెలంగాణ సాధన విషయంలో ఏకాభిప్రాయం సాధించడమే కాంగ్రెస్ సమన్వయ కమిటీ మీటింగ్ ముఖ్య ఉద్దేశమని దిగ్విజయ్ తెలిపారు. కమిటీ మీటింగ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు. సీడబ్ల్యూసీ నిర్ణయంపై ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయమని డిగ్గీ రాజా తెలిపారు. సీఎం కిరణ్ కూడా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని చెప్పారు. సీమాంధ్ర సమస్యలను రాష్ట్రంలోని అన్ని పార్టీలు జీవోఎం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. టీడీపీ, వైకాపా కూడా తమ నిర్ణయాన్ని జీవోఎం కు చెప్పాలని తెలిపారు.