: ఢిల్లీలో ముగిసిన జీవోఎం భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)మూడో సమావేశం ముగిసింది. తిరిగి ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు మళ్లీ సమావేశమవుతారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర విధివిధానాలపైనే ప్రధమంగా చర్చించారు. సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కె.విజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా 29 పేజీల నివేదికను టాస్క్ ఫోర్స్ బృందం షిండేకు సమర్పించింది. పాలనా వ్యవస్థ ఏర్పడే వరకే పోలీసు అకాడమీని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని సిఫార్సు చేసింది. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ను, పోలీసు వైర్ లెస్, పోలీసు రవాణా వ్యవస్థలను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని సూచించింది. ఇక పోలీసు శాఖలో కొరతను బట్టి నియామకాలు జరుపుకోవాలని టాస్క్ ఫోర్స్ బృందం సూచించింది. కాగా, మూడోసారి సమావేశానికి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ గైర్హాజరయ్యారు.