: యముడి వేషంలో తెదేపా ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన
చిత్తూరు జిల్లాలో సమైక్య ఉద్యమం 100 వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో, చంద్రగిరిలో తెదేపా ఎంపీ శివప్రసాద్ యముడి వేషంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జానపద గెటప్ లో, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి సన్నివేశానికి సంబంధించి ఒక కథ చెప్పారు.
తెలుగుతల్లిని తీసుకువెళ్లడానికి వచ్చిన యముడిని ఆమె... ఎందుకు తీసుకెళుతున్నావని అడుగుతుంది. దీనికి సమాధానంగా మీ సమయం ఆసన్నమయిందని యముడు చెపుతాడు. సీమాంధ్ర ప్రాంతానికి ప్రాజెక్టులు, ప్యాకేజీలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలను ఇస్తున్నారు కదా... ఇంకేం కావాలి? అని యముడు ప్రశ్నిస్తాడు. అన్నీ ఇస్తున్నారు కానీ, అవన్నీ సక్రమ పద్ధతిలో కాకుండా, అక్రమమైన రీతిలో ఇవ్వాలనుకుంటున్నారని తెలుగుతల్లి చెబుతుంది. ఈ విషయాన్ని యముడు తన దివ్య దృష్టితో నిర్ధారించుకుంటాడు. వెంటనే, అమ్మా నీవు చెప్పింది నిజమే... ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉండదు. ఇలాంటి అన్యాయాలను నేను అంగీకరించలేను... అందుకని ఈ రోజు నుంచి నేను నా వృత్తిని వదిలేస్తున్నానని అంటాడు. శివప్రసాద్ వేసిన ఈ జానపద నాటకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.