: అలకవీడిన పళ్ళంరాజు
కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎం.ఎం.పళ్ళంరాజు అలకవీడారు. ఏ విషయమా అని ఆలోచిస్తున్నారా..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తన మంత్రి పదవికి నెల క్రితమే రాజీనామా చేసేశారు. అప్పటి నుంచీ విధులకు దూరంగా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాలలోనూ పాల్గొనడం లేదు. అధికారులు ముఖ్యమైన ఫైళ్లను ఇంటికి తీసుకొస్తే సంతకం పెట్టేస్తున్నారు. అలాంటిది పళ్ళంరాజు ఉన్నట్లుండి ఈ రోజు ఢిల్లీలో విద్యపై జరిగిన ఒక వర్క్ షాపులో (అధికారిక కార్యక్రమం) పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇలాంటి సెమినార్లు తనకు ప్రయోజనకరమంటూ తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో పళ్ళంరాజు చెప్పారు. మంత్రి పదవికి రాజీనామాను నెల క్రితమే ప్రధానికి సమర్పించానని, ఆయన దానిని ఇంకా ఆమోదించలేదన్నారు. ఈ నేపథ్యంలో కొత్త తరహాలో పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. తీరిక వేళల్లో పనిచేస్తానని తెలిపారు.