: ప్రధానికి లేఖ రాయనున్న చంద్రబాబు నాయుడు
సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు విభజన విషయంలో ఎలా ముందుకెళతారని లేఖ ద్వారా ప్రధానిని ప్రశ్నించాలని టీడీపీ నిర్ణయించింది. హైదరాబాద్ లోని తన నివాసంలో పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు. ఇరు ప్రాంత జేఏసీ నేతలను పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తాము సూచిస్తుంటే, కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని తాము చెబితే తప్పుబట్టిన దిగ్విజయ్ సింగ్... కేసీఆర్ 3 లక్షల కోట్ల పరిహారం చెల్లించాలని అడుగుతుంటే మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా, పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన పయ్యావులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ నేతలు ఫిర్యాదు చేశారు. సాయంత్రం మరోసారి ప్రధానికి రాసే లేఖలో ప్రస్తావించాల్సిన అంశాల గురించి చర్చించనున్నారు.