: బెంగాల్ ను కుదిపేస్తున్న సచిన్ ఫీవర్... 'తాజ్ బెంగాల్'లో సచిన్ మెనూ
సచిన్ ఫీవర్ పశ్చిమ బెంగాల్ ను పట్టి కుదిపేస్తోంది. మొన్నామధ్య సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే సచిన్ కు ఘనంగా వీడ్కోలు పలుకుతామని ప్రకటించడంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్దలు, ప్రజలు సచిన్ కు తీపి గురుతులిచ్చేందుకు పోటీ పడుతున్నారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సచిన్ ను ఈడెన్ గార్డెన్స్ లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అశ్చర్యానికి, అనుభూతికి గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ బాధ్యత 'తాజ్ బెంగాల్ హోటల్' తీసుకుంది.
భారత్, విండీస్ జట్లు బస చేయనున్న తాజ్ బెంగాల్ హోటల్ ఓ ప్రత్యేక మెనూ సిద్ధం చేసింది. దీనికి 'సచిన్' అని పేరు కూడా ఖరారు చేసింది. ఇందులో బిహైండ్ ద స్టంప్స్, లెగ్ గ్లాన్స్, బౌండరీ వంటి నాన్ వెజ్ స్పెషల్ వంటకాలు సిద్ధం చేస్తోంది. మెక్సికన్ పిజ్జాలు, పిస్తాలకు స్క్వేర్ కట్, స్క్వేర్ లెగ్, హుక్, లేట్ కట్ అనే పేర్లతో చవులూరించే వంటలను సిద్ధం చేస్తోంది. మరో వైపు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఈడెన్ గార్డెన్స్ లోని ఓ గ్యాలరీకి సచిన్ పేరు పెట్టడంతో పాటు, సచిన్ భార్య అంజలికి ఓ ప్రత్యేక చీరను బహూకరించేందుకు రంగం సిద్ధం చేశారు.