: టీటీడీ అవినీతిపై ముఖ్యమంత్రికి రాఘవులు లేఖ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు లేఖ రాశారు. దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని లేఖలో కోరారు. కల్యాణోత్సవాల పేరుతో టికెట్ల రూపంలో భక్తుల నుంచి అక్రమంగా నిధులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కల్యాణోత్సవంలో పాల్గొనే సిబ్బంది, అర్చకులకు రవాణా ఖర్చులు, సంభావన వంటివి టీటీడీనే భరిస్తుందని పేర్కొన్న రాఘవులు, కల్యాణోత్సవాల్లో కోట్లాది రూపాయల అక్రమవసూళ్లు జరుగుతున్నాయని తెలిపారు.
పలుచోట్ల నిర్వహించిన కల్యాణోత్సవాల్లో ఓ పంచలోహ విగ్రహం అమ్ముకోవడంతో పాటు డైమండ్, గోల్డెన్, సిల్వర్ టికెట్ల పేరుతో కోట్లాది రూపాయలు బహిరంగంగా దండుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని అన్నారు. పవిత్రమైన స్థలంలో పెరిగిపోయిన అవినీతిని అడ్డుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రాఘవులు లేఖలో ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.