: గ్రామీణ వినియోగదారుల హక్కుల్ని కాలరాస్తున్నారు: టీడీపీ
విద్యుత్ టారిఫ్ విషయంలో గ్రామీణుల హక్కుల్ని కాలరాస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్ నేడు విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచుతూ, సర్ ఛార్జీ వడ్డిస్తూ గ్రామీణ వినియోగదారులను, నగర వినియోగదారులను ఓకేగాటన కట్టివేస్తున్నారని వారు చెప్పారు. నగరాలు, గ్రామాల మధ్య విద్యుత్ సరఫరాలో ఏకరూపత లోపించిందని టీడీపీ నేతలు వివరించారు.
నగరాల్లో విద్యుత్ కోతలు స్వల్ప స్థాయిలో ఉండగా, పల్లెలు అంధకారంలో మునిగిపోతున్నాయని రేవంత్ రెడ్డి, పయ్యావుల ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా గ్రామాలు తాగునీటికి నోచుకోవడంలేదని విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ కు తెలిపారు. విద్యుత్ సంస్థలు, ప్రభుత్వం పక్షపాత ధోరణి కనబర్చడం సబబు కాదని వారు హితవు పలికారు.