: బీహార్ రాష్ట్ర అతిథి హోదాలో మోడీ పర్యటన
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్ర అతిథిగా మారనున్నారు. పాట్నా బాంబు పేలుళ్ళ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బీహార్ పర్యటనను మోడీ అతిథి హోదాలో చేయనున్నారు. రేపటి నుంచి జరగనున్న ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రాష్ట్ర అతిథి హోదాలో ప్రోటోకాల్ ఉంటుందని బీహార్ కేబినెట్ కమిటీ ముఖ్య కార్యదర్శి బ్రజేష్ మహరోత్రా తెలిపారు. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ శాఖ హర్షం వ్యక్తం చేసింది. మోడీ 'రాష్ట్ర అతిథి' హోదాకు పూర్తిగా అర్హుడని సుశీల్ కుమార్ మోడీ తెలిపారు. బీహార్ లో గత వారం మోడీ తలపెట్టిన సభ సందర్భంగా బాంబు పేలుళ్ళతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వారి స్వస్థలాలకు వెళ్లి మోడీ వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.