: తగ్గించిన ఇంటర్నెట్ డేటా ధరలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వొడాఫోన్
దీపావళి పండుగ సందర్భంగా వొడాఫోన్ తన కస్టమర్లకు ఆఫర్ ప్రకటించింది. 80 శాతం తగ్గించిన ఇంటర్నెట్ డేటా ధరలను ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. గతంలో పది పైసలున్న 10 కేబీ డేటా ధరను జూన్ నెలలో రెండు పైసలకు తగ్గించింది. ఆ సమయంలో ఈ ధరలు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ సర్కిళ్లలోనే వోడాఫోన్ అమలుచేసింది. ఇప్పుడీ ధరలనే దేశవ్యాప్తంగా ఉన్న తన అన్ని సర్కిళ్లలో అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తాజాగా తెలిపింది. కస్టమర్ రోమింగ్ లో ఉన్నా ఇవే ధరలు ఛార్జ్ చేస్తామని చెప్పింది. విస్తరిస్తున్న ధరలు 2జీ పరిజ్ఞానం కలిగిన ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని వివరించింది. మార్కెట్లో అత్యంత తక్కువగా మొబైల్ ఇంటర్నెట్ ధరలు వసూలు చేస్తుంది తామేనంది.