: ఒక గొప్ప పనిని సంకల్పించాం: మోడీ
'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' పేరిట సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి తనకు చాలామంది ప్రేరణ ఇచ్చారని, సూచనలు అందించారని, ప్రోత్సహించారని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. గుజరాత్ లో విగ్రహ నిర్మాణ పనుల శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానిర్మాణానికి ప్రోత్సాహమందించిన వారందరి కోరికలు తీరాలని, సుఖశాంతులతో వారు ఉండాలని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. విగ్రహ నిర్మాణం కోసం నర్మదా అనే చిన్న జిల్లాను ఎంచుకున్నానని, ఈ పని పూర్తయ్యాక దీని పేరు మార్మోగిపోతుందని తెలిపారు.
భవిష్యత్తులో వల్లభాయ్ పటేల్ విగ్రహం వల్ల చాలా అబివృద్ధి నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం కోసం కొత్తగా గరుడేశ్వర్ తాలుకా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాంతం గర్వపడేలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నీటి విలువ దేశంలో రాజస్థాన్, గుజరాత్ లకు బాగా తెలుసని ఆయన అన్నారు. అందుకే ఒక్క చుక్క నీటి బొట్టు కూడా వృథా కానివ్వబోమని చెప్పారు.
మనం ఇంకా బానిసలుగా బ్రతుకుతున్నామని, స్వేచ్ఛగా స్వయం సాధన దిశగా అడుగులు ఎందుకు వేయలేకపోతున్నామో ఆలోచించాలని మోడీ సూచించారు. స్వావలంబన దిశగా అడుగులు వేయాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచంలో అతి ఎత్తయిన విగ్రహంగా పటేల్ విగ్రహం నిలుస్తుందని మోడీ తెలిపారు. సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఐక్యతకు చిహ్నం అని అన్నారు. సర్థార్ పటేల్ సెక్యులర్ అన్నది నిజమేనని, కానీ ఓటు బ్యాంకు సెక్యులర్ కాదని, దీన్ని ప్రధాని గుర్తించుకోవాలని మోడి సూచించారు.