: సచిన్ వన్డే రికార్డులు కోహ్లీ బద్దలు కొడతాడు: గవాస్కర్
నాగపూర్ మ్యాచ్ లో ఆసీస్ కు చుక్కలు చూపిన టీమిండియా యువకిశోరం విరాట్ కోహ్లీపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తులో సచిన్ వన్డే రికార్డులను బద్దలు కొట్టడం కోహ్లీకే సాధ్యమని చెప్పాడు. నిన్న జరిగిన ఆరోవన్డేలో కోహ్లీ 66 బంతుల్లోనే 115* పరుగులు సాధించడంతో భారత్ 351 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం అవలీలగా ఛేదించింది. మ్యాచ్ అనంతరం సన్నీ మీడియాతో మాట్లాడుతూ, భారత్ కు కోహ్లీ ఓ వరం అని అభివర్ణించాడు. సచిన్, కోహ్లీ.. ఇరువురి కెరీర్లో తొలి 115 మ్యాచ్ లను పరిశీలిస్తే, కోహ్లీనే మెరుగ్గా కనిపిస్తాడని పేర్కొన్నాడు. సచిన్ వన్డేల్లో తొలి సెంచరీ సాధించేందుకు 80 వన్డేల దాకా వేచిచూడాల్సి వచ్చిందని.. ప్రస్తుతం 118 వన్డేలాడిన కోహ్లీ ఈసరికే ఎన్నో రికార్డులు అధిగమించాడని కితాబిచ్చాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత పరిస్థితులను ఆకళింపు చేసుకోవడంలో కోహ్లీ తర్వాతే ఎవరైనా అని గవాస్కర్ కొనియాడాడు.