: బస్సు ప్రమాద తీవ్రత పెరిగిందిలా....
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మృతుల కథ తెలుసుకుంటుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. మృతదేహాలు ఉన్న ఘటనాస్థలి వద్ద మృతుల కుటుంబీకుల రోదనకు చలించని మనసు లేదు. బస్సు ప్రమాదానికి కారణం అతివేగమైతే ఆ తీవ్రతను పెంచింది మాత్రం ఇంధనం, ఏసీ మెషీనే. వోల్వో బస్సు కుడి వైపు కల్వర్టును ఢీ కొనడంతో డీజిల్ ట్యాంకు పగిలిపోయింది. మెటల్ వస్తువు రోడ్డును రాసుకోవడంతో రేగిన నిప్పురవ్వలు డీజిల్ లో పడి మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో బస్సులో మూడు ఇంధన ట్యాంకర్లలో 350 లీటర్ల డీజిల్ ఉంది. భారీగా ఆయిల్ కలిగి ఉన్న డీజిల్ ట్యాంకులు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు ఏసీ కావడంతో ఏసీలో నింపే ఫ్రీయాన్ గ్యాసు కూడా అగ్నికి ఆజ్యం పోసింది. ఫ్రీయాన్ గ్యాసులో ఉండే అమ్మోనియం కు మండే గుణం ఎక్కువ. దీంతో, ఘటన జరిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు ప్రయాణీకులను చుట్టుముట్టాయి.
దీనికితోడు, బస్సు సీట్లు రెగ్జిన్ తో తయారు చేస్తారు. బస్సులో ప్రయాణీకులకు సరఫరా చేసే దుప్పట్లు కూడా ఉన్నివి కావడంతో వాటితో రక్షణ పొందే అవకాశం లేదు. ఇక, బస్సులో ఆటోమేటిక్ లాకింగ్ సిస్టం ఉంటుంది. దాని కంట్రోల్ డ్రైవర్ దగ్గర ఉంటుంది. మంటలు వ్యాపించగానే డ్రైవర్ మరో ఆలోచన లేకుండా తప్పించుకున్నాడు. దీంతో, ఎమర్జెన్సీ డోర్ కూడా తెరుచుకోలేదు.
బస్సులో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ డోర్ ను చేరుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. బస్సు వెనుక ప్రాంతంలో ఉన్న సీట్లలో 30 శవాలు లభ్యం కావడం చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. దీన్నిబట్టి, ప్రయాణీకులు ప్రాణాల కోసం ఎలా పోరాడారో ఊహించొచ్చు.