: సీఎం కావాలన్న కోరికే జగన్ తో అలా మాట్లాడిస్తోంది: డీఎస్
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న డిమాండ్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్. జగన్ చిన్నపిల్లవాడని, సీఎం కావాలన్న కోరికే అలా మాట్లాడిస్తోందన్నారు. హైదరాబాదులో ఏపీజేఎఫ్ మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న డీఎస్ పైవిధంగా మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన ఘనత తమదే అని చెప్పుకునే వారి మాటల్లో దమ్ము లేదన్న డీఎస్, ఆ క్రెడిట్ సోనియాదేనన్నారు.
తెలంగాణ కోసం తాము చిత్తశుద్ధితో ఉద్యమించామని, ఈ విషయంలో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటును అడ్డుకోవడం మామూలు విషయం కాదని చెప్పుకొచ్చారు. విభజనపై అధిష్ఠానానికి సీఎం లేఖ రాయడం సరికాదని, మూడు రాష్ట్రాల విభజనకు బీజేపీకి ఇతర రాష్ట్రాల సీఎంలు సహకరిస్తే ఇక్కడ కిరణ్ ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారన్నారు. గతంలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానన్నది.. ఇప్పుడు చేయనంటున్నది కేసీఆరేనన్న డీఎస్.. ఆయన గంటకో మాట మాట్లాడతున్నారని విమర్శించారు.